అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరిన వేళ, ఇరాన్‌పై దాడుల విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ ప్రస్తుతం చర్చల అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

యుద్ధాన్ని ముగించడానికి రెండు మార్గాలు ఉన్నాయని ట్రంప్ వివరించారు. దాడుల తీవ్రతను పెంచి ఇరాన్ వద్ద ఉన్నవన్నీ నాశనం చేయడం లేదా ఒప్పందం చేసుకోవడం అనే రెండు అవకాశాలు తమ ముందున్నాయని ఆయన చెప్పారు. డీల్ చేసుకోవడమే తెలివైన వ్యూహమని పేర్కొన్నప్పటికీ, చర్చల పట్ల ఇరాన్ సీరియస్‌గా ఉన్నంత మాత్రాన ఒప్పందం ఖాయమని చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు. తమ వైపు నుంచి క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

మరోవైపు, ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని ట్రంప్ చేసిన ముందస్తు హెచ్చరికలకు ఇరాన్ గట్టిగా బదులిచ్చింది. అమెరికా బెదిరింపులకు తాము తలొగ్గే ప్రసక్తే లేదని, బలప్రయోగం లేదా ఒత్తిడికి స్పందించబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కు ఆయుధాలు విక్రయించవద్దని చైనా, రష్యాలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.

చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ లొంగిపోవచ్చు లేదా ఎక్కడైనా దాక్కోవచ్చునని ఆయన పేర్కొన్నారు.