కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు.

మొత్తం 80 పోస్టులలో అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు 29, ఓబీసీలకు 18, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) అభ్యర్థులకు 8 ఖాళీలు కేటాయించారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ లా, లేబర్ లాస్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

అభ్యర్థుల వయస్సు 2026, సెప్టెంబర్ 11 నాటికి 35 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 25 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆఫ్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్షలో 120 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో ప్రశ్నకు 2.5 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు, ప్రశ్న వదిలేస్తే మార్కులు తగ్గవు.

రాత పరీక్షలో ఇంగ్లిష్, భారతీయ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, రాజ్యాంగం, కరెంట్ అఫైర్స్, గణితం, కంప్యూటర్ పరిజ్ఞానం, కార్మిక చట్టాలు, అకౌంటెన్సీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. తుది మెరిట్ జాబితా కోసం రాత పరీక్షకు 75 శాతం, ఇంటర్వ్యూకు 25 శాతం వెయిటేజీని కలిపి మొత్తం 400 మార్కులకు ఫలితాలు ప్రకటిస్తారు.

ఇంటర్వ్యూలో అర్హత సాధించడానికి జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50, ఓబీసీలు 45, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 40 మార్కులు పొందాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు upsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.