మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలకేంద్రానికి చెందిన గంధం శ్రీను, శ్రీవాణి దంపతుల కుమారుడు లక్ష్మీనాథ్‌ ‘విక్రమ్‌–1’ ప్రైవేట్‌ ఆర్బిటాయ్‌ రాకెట్‌ తయారీ బృందంలో కీలకంగా పని చేశారు. ఎలక్ట్రికల్‌ కేబుల్‌ హెర్నెస్‌ డిజైన్‌, ఇంటిగ్రేషన్‌ అండ్‌ టెస్టు ఇంజనీర్‌గా పనిచేసి యువతకు ఆదర్శంగా నిలిచాడు. వ్యవసాయ నేపథ్య కుటుంబానికి చెందిన లక్ష్మీనాథ్‌..

తండ్రి స్థానిక ఓ సిమెంట్‌ పరిశ్రమలో మిల్లర్‌గా, తల్లి ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తూ లక్ష్మీనాథ్‌ను చదివించారు. టెన్త్‌ వరకు స్థానిక సీతా పబ్లిక్‌ స్కూల్‌లో చదివిన లక్ష్మీనాథ్‌.. ఇంటర్‌, బీటెక్‌ (2023)హైదరాబాద్‌లో పూర్తి చేశాడు.

బీటెక్‌ తర్వాత డీఆర్‌డీఓలో ఇంటిగ్రేషన్‌ టెస్ట్‌ ఇంజనీర్‌గా ఏడాదిపాటు పనిచేశాడు. స్కైరూట్‌ ఏరోస్పేస్‌లో సంవత్సర కాలంగా పనిచేస్తూ ఎలక్ట్రికల్‌ కేబుల్‌ హర్నెస్‌ డిజైన్‌, ఇంటిగ్రేషన్‌ అండ్‌ టెస్ట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ విక్రమ్‌–1 (మిషన్‌ ఆగమన్‌)లో కీలకంగా బాధ్యతలు నిర్వర్తించి ప్రయోగం విజయవంతం కావడానికి కృషిచేశారు. భవిష్యత్‌లో భారత అంతరిక్ష రంగ అభివృద్ధికి మరింత సేవలందిస్తూ మారుమూల గ్రామీణ ప్రాంతాల యువతకు స్ఫూర్తిగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు లక్ష్మీనాథ్‌ పేర్కొన్నారు.