ఈనెల 25న శనివారం రోజున తొలి ఏకాదశి పర్వదినం రానుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా, శయన ఏకాదశిగా, ప్రధమ ఏకాదశిగా లేదా హరివాసరంగా పిలుస్తారు. ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుందని, సూర్యుడు దక్షిణ దిశగా వాలుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, వీటన్నింటినీ నియంత్రించే మనసు కలిపి పదకొండుగా పరిగణిస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధిలో శేషపాన్పుపై యోగనిద్రలోకి వెళ్తాడు. దీనితో పాటు నాలుగు నెలల పాటు సాగే చాతుర్మాస్య వ్రతం కూడా ఈ రోజు నుంచే మొదలవుతుంది.
ఈ వ్రతం ఆచరించేవారు దశమి రాత్రి నుంచి ఉపవాసం ఉండి, ఏకాదశి నాడు శ్రీహరిని పూజించాలి. ఆ రోజున అసత్యం పలకడం, దుష్ట ఆలోచనలు చేయడం, స్త్రీ సాంగత్యం వంటివి చేయకూడదు. రాత్రంతా జాగరణ చేసి, మర్నాడు ద్వాదశి రోజున పూజ ముగించి ప్రసాదం స్వీకరించిన తర్వాతే భోజనం చేయాలి. కాల్చి వండినవి, మాంసాహారం, చింతపండు, ఉసిరి, మినుములు వంటి పదార్థాలను ఈ వ్రత సమయంలో తీసుకోకూడదు.
రైతులు ఈ పండుగను ఎంతో ప్రాముఖ్యతతో జరుపుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా, పంటలకు తెగుళ్లు సోకకుండా ఉండాలని కోరుకుంటూ మొక్కజొన్న పేలాల పిండిని బెల్లంతో కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ చాతుర్మాస్య వ్రతం కొనసాగుతుంది, ఆ రోజున విష్ణువు మేల్కొంటాడని నమ్మకం.








