మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన కొన్ని గంటలకే వధువు తాను మరొకరిని ప్రేమిస్తున్నానని, కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే ఈ వివాహం చేసుకున్నానని భర్తకు నిజం చెప్పింది. దీంతో ఆ దంపతులు కలిసి జీవించడం ఇష్టం లేక విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు దంపతులు ఇండోర్‌లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13-బి ప్రకారం విడాకులకు ముందు ఏడాది పాటు విడిగా ఉండాలనే నిబంధనను కోర్టు గుర్తుచేసింది. ఈ నిబంధనపై న్యాయవాది వర్షా గుప్తా స్పందిస్తూ, సుప్రీం కోర్టు ఉత్తర్వులను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 14(2) ప్రకారం, ఉనికిలో లేని వివాహంలో భార్యాభర్తలను కలిసి ఉండమని బలవంతం చేయకూడదని న్యాయవాది వాదించారు. దంపతుల సమయం, జీవితాలు వృథా కాకుండా ఉండాలంటే వారిని విడదీయడమే సరైనదని ఆమె కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, దంపతుల అంగీకారాన్ని పరిగణనలోకి తీసుకుంది.

చివరకు కోర్టు ఆ జంటకు విడాకులు మంజూరు చేసింది. పెళ్లైన 168 గంటల వ్యవధిలోనే, అంటే ఏడు రోజుల్లోనే ఈ వివాహ బంధం చట్టబద్ధంగా ముగిసింది.