హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌లో ఆధార్ ఆధారిత నిధుల బదిలీ విధానం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. గతేడాది ఆషాడ మాస బోనాల సమయంలో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ఈ ఆధార్ బేస్డ్ పేమెంట్స్ విధానాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది కాలంలో సుమారు రెండున్నర లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.6,800 కోట్ల ప్రభుత్వ సాయాన్ని నేరుగా జమ చేసినట్టు అధికారులు వెల్లడించారు. గతేడాది ఫిబ్రవరిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం కాగా, ఏప్రిల్ నుంచి ఇండ్ల నిర్మాణాలు మొదలయ్యాయి.

ప్రారంభంలో లబ్ధిదారులు దరఖాస్తులతో పాటు ఇచ్చిన సాధారణ బ్యాంక్ ఖాతాలకే నిధులు బదిలీ చేసేవారు. అయితే, లబ్ధిదారులు ఇచ్చిన ఖాతాలు చాలా వరకు వాడకంలో లేకపోవడం, మినిమం బ్యాలెన్స్ లేదనే కారణంతో బ్యాంకులు నిధులు కట్ చేసుకోవడం, పాత అప్పులు, వడ్డీల కింద కట్ చేస్తున్నట్టు లబ్ధిదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి, ఆ ఖాతాల్లోని నిధులను హోల్డ్ చేయాలని బ్యాంకులకు లేఖలు రాశారు.

ఆపై పాత విధానానికి స్వస్తి చెప్పి, ఆధార్‌‌‌‌‌‌‌‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా లేదా పోస్టల్ అకౌంట్‌‌‌‌‌‌‌‌కు మాత్రమే నేరుగా ప్రభుత్వ సాయం బదిలీ చేయడం ప్రారంభించారు. ఈ కొత్త విధానం వల్ల ఎలాంటి కోతలు లేకుండా లబ్ధిదారులకు పూర్తి సాయం సురక్షితంగా అందుతోంది.