గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం ద్వారా మొత్తం లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్లను కేటాయిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను అధికారులు గుర్తించారు. నియోజకవర్గాన్ని యూనిట్‌గా పరిగణించి ఈ ఇళ్లను కేటాయిస్తారు. ఇందిరమ్మ టవర్స్ కోసం ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఒక్కో ఫ్లాట్ విలువ సుమారు 40 నుంచి 60 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఈ గృహ నిర్మాణ పనులను ఆగస్టు చివరి వారంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నారు.







