జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం అధికారులు వన్‌వే నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా, టీజీఎస్‌ఆర్టీసీ తన బస్సుల ప్రయాణ మార్గాలను, స్టాప్‌లను క్రమబద్ధీకరించింది.

ప్రధానంగా 127K, 222A, 47L, 10H రూట్లలో బస్సుల ప్రయాణ మార్గాలను అధికారులు మార్చారు. జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 45, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు మారిన రూట్లను గమనించాలని సంస్థ సూచించింది.

47L రూట్ ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి మణికొండకు వెళ్లేటప్పుడు బేగంపేట, ఎల్‌వీ ప్రసాద్, బసవతారకం హాస్పిటల్, ఫిల్మ్‌నగర్ మీదుగా వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో మణికొండ నుంచి జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, పంజాగుట్ట మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది.

10H రూట్ సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ వెళ్లేటప్పుడు మైత్రివనం, యూసఫ్‌గూడ, పెద్దమ్మగుడి మీదుగా వెళ్తుంది. అలాగే 222A బస్సు కోఠి నుంచి పటాన్‌చెరుకు వెళ్లేటప్పుడు మసబ్ ట్యాంక్, ఎల్‌వీ ప్రసాద్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్ పీఎస్ మీదుగా ప్రయాణిస్తుంది.

127K రూట్ కోఠి నుంచి కొండాపూర్ వెళ్లేటప్పుడు పెన్షన్ హౌస్, ఎమ్మెల్యే కాలనీ, రోడ్ నంబర్ 45 మీదుగా వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో కొండాపూర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్‌వీ ప్రసాద్, మసబ్ ట్యాంక్ మీదుగా కోఠి చేరుకుంటుంది.

ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ముందు మారిన బస్సు రూట్లు, స్టాప్‌లను ముందుగానే చూసుకోవాలని అధికారులు కోరారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైతే అదనపు బస్సు సర్వీసులను నడిపేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు టీజీఎస్‌ఆర్టీసీ తెలిపింది.