హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 39 తయారీ యూనిట్లు, 91 విక్రయ కేంద్రాలు కలిపి మొత్తం 130 సంస్థల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల క్రీమ్, 1,200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి, 30 కిలోల స్టార్చ్‌తో పాటు కృత్రిమ నెయ్యి ఫ్లేవర్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ కల్తీ నెయ్యి తయారీకి పామాయిల్, వనస్పతి, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, స్టార్చ్‌ను వాడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. తక్కువ ఖర్చుతో తయారైన ఈ ఉత్పత్తులను '100% Pure Ghee' వంటి పేర్లతో అధిక ధరలకు అమ్ముతూ అక్రమ లాభాలు పొందుతున్నారు. కొన్ని ప్యాకెట్లపై కనీసం బ్యాచ్ నంబర్, FSSAI (భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ) లైసెన్స్ వివరాలు, తయారీ తేదీ వంటివి కూడా లేవు.
ఈ కల్తీ నెయ్యి కేవలం ఇళ్లకే కాకుండా హోటళ్లు, స్టార్ హోటళ్లు, స్వీట్ షాపులు, బేకరీలు, క్యాటరర్లు, ఆయుర్వేద షాపులకు కూడా సరఫరా అవుతోంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ముడి క్రీమ్‌ను తక్కువ ధరకు సేకరించి, హైదరాబాద్‌లో నెయ్యిగా మారుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో గతంలో TV9 చేసిన నిఘా కథనాల ఆధారంగా ఈ దాడులు జరిగాయి.
స్వాధీనం చేసుకున్న పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు ల్యాబొరేటరీ పరీక్షలకు పంపించారు. ఈ రిపోర్టుల ఆధారంగా కల్తీ స్థాయి, వాడిన పదార్థాల నాణ్యతపై పూర్తి స్పష్టత రానుంది. నాణ్యత లేని కొవ్వులు, హానికర పదార్థాలు కలిసిన ఈ నెయ్యిని వాడటం వల్ల గుండె సమస్యలు, కొలెస్ట్రాల్ పెరగడం, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
నెయ్యి కొనేటప్పుడు ప్యాకింగ్ సీల్, తయారీదారు వివరాలు, FSSAI లైసెన్స్, గడువు తేదీలను తప్పనిసరిగా చూడాలని పోలీసులు సూచించారు. అపరిశుభ్రమైన పరిస్థితులు లేదా కల్తీని గుర్తిస్తే ప్రజలు 112 నంబర్‌కు లేదా H-FAST హెల్ప్‌లైన్ 8712661212కు సమాచారం ఇవ్వవచ్చు. ఫిర్యాదు చేసే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు.








