హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో భారీ ఆర్డర్ లభించింది. ఉత్తర అమెరికాకు చెందిన ఒక కస్టమర్ నుంచి 104.9 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని ఈ సంస్థ దక్కించుకుంది. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 1,013 కోట్లుగా ఉంది.

ఈ ఒప్పందం ప్రకారం, సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ 147,000 బేస్ బ్లీడ్ ఆర్టిలరీ షెల్ బాడీలను తయారు చేసి సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిలరీ ఆధునీకరణ కోసం జరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో ఈ ఆర్డర్ రావడం విశేషం. గతంలో ఈ సంస్థ 155 ఎంఎం ఫ్యూజ్‌లు, ఎం107 ఆర్టిలరీ షెల్ బాడీల తయారీకి సంబంధించిన కాంట్రాక్టులను కూడా పూర్తి చేసింది.

తమ తయారీ సామర్థ్యంపై అంతర్జాతీయ కస్టమర్లు ఉంచిన నమ్మకానికి ఈ ఒప్పందమే నిదర్శనమని సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సీఈఓ సునీల్ కలిదిండి పేర్కొన్నారు. ఈ ఆర్డర్‌ను రాబోయే ఆరు నుంచి 12 నెలల కాలంలో పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ ప్రాజెక్టుతో అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి సామర్థ్యం కలిగిన తయారీదారుగా కంపెనీ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.