మేడ్చల్‌ మల్కాజిగిరిలో 63%, రంగారెడ్డిలో 64%, సంగారెడ్డిలో 79% డిజిటలైజేషన్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించడానికి సోమవారం(ఆగస్టు 10)తో గడువు ముగియనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం రెండు సార్లు గడువు పొడిగించింది. గడువు పెంపుతో బిఎల్‌ఒలు ఇంటింటికీ వెళ్లి అన్‌ట్రేసబుల్, ఆబ్సెంట్ విభాగంలో చూపినవారి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. కొందరి వివరాలు లభ్యం కావడంతో వివరాలు నమోదుచేసి ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. శాశ్వతంగా వలస వెళ్లిన విభాగంలో చూపించినవారి వివరాలు మరోసారి పరిశీలించి గుర్తిస్తే రోల్‌బ్యాక్ చేసి ఫారాలు నమోదు చేశారు. ఇప్పటివరకు ఫారాలు ఇవ్వనివారిలో కొందరు ఆన్‌లైన్‌లో సమర్పించారు.

రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ తిరిగి వెనక్కి తీసుకునేందుకు వీలు లేని ఫారాలను అన్‌కలెక్టబుల్ వాటిగా పరిగణిస్తారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు అందించామని, వాటిలో కొన్ని పత్రాలు సేకరించేందుకు వీలు లేకుండా ఉండటంతో వాటిని అన్‌కలెక్టబుల్‌గా నిర్ధారిస్తున్నట్లు అధికారులు గణాంకాలతో చూపిస్తున్నట్లు తెలిసింది. అన్‌కలెక్టబుల్ జాబితాలో ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ (ఎఎస్‌డి) కేటగిరీలో 2,84,021(0.84 శాతం) ఓట్లు ఉన్నాయి. డబుల్ ఎంట్రీస్(డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ -డిఎస్‌ఇ) జాబితాలో 3,18,598 మంది ఉన్నారు. ఇది మొత్తం ఓటర్లలో 0.94 శాతం.

సర్‌లో చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియ గడువు తేదీ నాటికి 80 శాతం కూడా దాటే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 78.14 శాతం ఎన్యూమరేషన్ పత్రాలను మాత్రమే సిబ్బంది డిజిటలైజేషన్ చేశారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ఆదివారం సాయంత్రం వరకు 2,64,30,494 (78.14 శాతం) మంది ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. అంటే ఇప్పటివరకు 73,95,954 ఫారాలు ఓటర్లు సమర్పించాల్సి ఉన్నది. ఈ ఓట్లను అన్‌కలెక్టబుల్ ఓటర్లుగా గుర్తించి వందశాతం డిజిటైజేషన్ పూర్తిచేశారు. వీరిలో మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, డబుల్ ఎంట్రీ ఉన్నవారు, ఆబ్సెంట్ అయినవారు, ఇతరత్రా కారణాలతో అందుబాటులో లేనివారిగా వీరిని పరిగణించారు. సోమవారం(ఆగస్టు 10) వరకు ఎన్యూమరేషన్ పత్రాల ఆన్‌లైన్‌కు సమయం ఉండగా, ఇందులో చివరి మూడు రోజులు రెండో శనివారం, ఆదివారం, సోమవారం (బోనాల పండగ) సెలవులు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వరకు ఫారాలు సమర్పించనివారు సోమవారం వరకు కూడా సమర్పించే అవకాశం కనిపించడం లేదు.

రాష్ట్రంలో ఓటర్లకు వంద శాతం ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేసినట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. కానీ, చాలా మందికి ఇప్పటికీ ఫారాలు అందలేదు. ఇలా పంపిణీ చేయని పత్రాలను కూడా అధికారులు అన్‌కలెక్టబుల్ కింద పరిగణిస్తున్నారంటూ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. నిబంధన ప్రకారం ఎఎస్‌డి కేటగిరీ కింద ఒక ఓటరు పేరును తీసివేయాలంటే పోలింగ్ బూత్ పరిధిలోని పోలింగ్ ఏజెంట్ (బిఎల్‌ఎ) ద్వారా ఇసి అధికారులు సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది.అయితే, చాలా చోట్ల అన్‌కలెక్టబుల్ గురించి బిఎల్‌ఎలకు అవగాహన లేకుండానే ఎఎస్‌డి ఓట్లపై పూర్తి వివరాలు తెలుసుకోకుండా సంతకాలు చేస్తున్నట్లు తెలిసింది.

రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే భారీగా ఓట్లు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో 47,36,669 మంది ఓటర్లు ఉండగా 27,74,687 (58.58 శాతం) ఫారాలు, మేడ్చల్ -మల్కాజిగిరిలో 29,79,130 మంది ఓటర్లకు గానూ 19,01,328 (63.82 శాతం), రంగారెడ్డిలో 36,99,743 మంది ఓటర్లకు 24,01,390 (64.91 శాతం), సంగారెడ్డిలో 14,57,436 మంది ఓటర్లకు 11,51,108 (79.26 శాతం) పత్రాలను మాత్రమే బిఎల్‌ఒలు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 94.30 శాతం, జనగామలో 91.69 శాతం, మెదక్‌లో 90.54 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. మిగతా జిల్లాల్లో 80 నుంచి 90 శాతం మధ్యలోనే డిజిటలైజేన్ జరిగింది. సోమవారం ఒక్క రోజు రాష్ట్రవ్యాప్తంగా ఒక్క శాతం పెరిగినా మొత్తంగా 80 శాతం కూడా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాదని అధికారవర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో ఈనెల 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ ప్రారంభం కాగా, ఆగస్టు 10 వరకు ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు గడువు ఉంది. పలు రాజకీయ పార్టీలు, సంఘాల విజ్ఞప్తి మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే రెండు సార్లు గడువు పొడిగించింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17వ తేదీన ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల చేసి, ఆ రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 15 వరకు అభ్యంతరాను పరిశీలిస్తారు. ఈ సమయంలో నోటీసులు, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ నిర్వహిస్తారు. అక్టోబర్ 19వ తేదీన తుది ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం ప్రకటించనుంది.