బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో, పీఏ విచారణ కోసం సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పండగ రోజు సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో సుమారు 15 మంది ముసుగులు ధరించి నేరుగా విచారణ గదిలోకి ప్రవేశించినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
అయితే, అక్కడ ఉన్న బీఆర్ఎస్ లీగల్ టీమ్ సభ్యులు అడ్డుకోవడంతో ఆ వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ లోపలే ఇలాంటి ఘటన జరగడం చాలా తీవ్రమైన విషయమని ఆయన పేర్కొన్నారు.
ఈ ముసుగు వ్యక్తులు ఎవరు, వారు స్టేషన్‌లోకి ఎలా వచ్చారు, వారి వెనుక ఉన్న శక్తులు ఏమిటి అనే అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరగాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో స్టేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరి వివరాలను సేకరించాలని ఆయన సూచించారు.
స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల రికార్డింగ్‌లను ఎలాంటి మార్పులు చేయకుండా భద్రపరచాలని ఆయన కోరారు. సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించి అసలు నిజాలను బయటపెట్టాలని ఆయన కోరారు.
హోంశాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై వెంటనే స్పందించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. పారదర్శకమైన విచారణ జరిపి, దాడికి ప్రయత్నించిన వ్యక్తులతో పాటు వారి వెనుక ఉన్నవారిని కూడా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.





