హుజూర్‌నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో ఉన్న శ్రీలక్ష్మి నరసింహ గణేష్ ఫార్ బాయిల్డ్ మోడ్రన్ రైస్ మిల్లు నుంచి విపరీతమైన బూడిద, పొట్టు కాలుష్యం వెలువడుతోంది. మిల్లు యజమాన్యం సరైన బూడిద గది, పొట్టు గది ఏర్పాటు చేయకుండా, ప్రహరీ గోడ కూడా లేకుండా బహిరంగంగా కాలుష్యాన్ని వదులుతోందని స్థానిక కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, రోడ్డుపై ప్రయాణించే వాహనదారుల కళ్లలో బూడిద పడి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు తెలిపారు.
ఈ సమస్యపై 15 రోజుల క్రితమే స్థానికులు పురపాలక సంఘం కమిషనర్ సతీష్‌కి ఫిర్యాదు చేశారు. ఆయన మిల్లును సందర్శించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని యజమానిని హెచ్చరించారు. అయితే, కమిషనర్ సూచనలను యజమాని ఏమాత్రం పట్టించుకోకుండా యథావిధిగా కాలుష్యాన్ని వెదజల్లుతూ మిల్లును నడుపుతున్నారు.
పరిస్థితి తీవ్రతరం కావడంతో శనివారం కాలనీవాసులు మిల్లు యజమానిని నిలదీశారు. ఈ సందర్భంగా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి నరసింహారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గెల్లి రవి అక్కడికి చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మిల్లును నడపడం తప్పు అని వారు యజమానిని మందలించారు.
కాలుష్య నివారణకు అవసరమైన చర్యలన్నింటినీ 15 రోజుల్లోపు పూర్తి చేయాలని యజమానిని వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శ్రీమన్నారాయణ, నాగేశ్వరరావు, ఆంజనేయులు, లాలయ్య, నరసింహ, శంకర్ రావు, బుజ్జి పాల్గొన్నారు.








