ఉజ్బెకిస్థాన్‌లో దారుణంగా హత్యకు గురైన 22 ఏళ్ల కేరళ వైద్య విద్యార్థిని సావారియా బసంత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ కూతురిని మతమార్పిడికి బలవంతం చేసి, చిత్రహింసలకు గురి చేసి చంపేశారని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం జిల్లా ఎస్పీని కలిసిన కుటుంబం, హంతకుడిని భారత్‌కు రప్పించి విచారణ జరపాలని కోరింది.

ఈ ఫిర్యాదు మేరకు స్థానిక హరిపడ్ పోలీస్ స్టేషన్‌లో మర్డర్ కేసు నమోదైంది. సహపాఠి సదరుల్ అనమ్ ల్యాప్‌టాప్‌తో సావారియా తలపై కొట్టి చంపేశాడని, మృతదేహంపై పలు చోట్ల గాయాలు ఉన్నాయని కుటుంబం ఆరోపించింది. అలప్పుజా వైద్య కళాశాలలో మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

కేసు విచారణపై కాయంకులం డీప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిను కుమార్ స్పందించారు. విదేశంలో ఘటన జరిగినా నిబంధనల ప్రకారం ఇక్కడ కేసు ఫైల్ చేశామని, ఉజ్బెకిస్థాన్ పోలీసులు దోషికి శిక్ష వేస్తే ఇక్కడ కేసు మూసేస్తామని చెప్పారు. ఒకవేళ అక్కడ చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే, ఈ కేసును ఛేదించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంలో ఉజ్బెకిస్థాన్‌లోని భారత రాయబారి కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటామని డీఎస్పీ బిను కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్ పోలీసుల చర్యలపై ఆధారపడి భవిష్యత్ చర్యలు ఉంటాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.