ఆరు నెలలకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో కొంతకాలంగా ఉన్న విరామానికి అమెరికా బలగాలు ఆదివారం తెరదీశాయి. హర్మూజ్ జలసంధిలోని లారక్ కేంద్రంలో ఉన్న క్షిపణి ప్రయోగ కేంద్రమే లక్ష్యంగా అమెరికా ఈ దాడులు చేసింది.
సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలకు ఆటంకం కలిగించేలా, నీటి అడుగున అమర్చే పేలుడు పరికరాలు లేదా మందుపాతరలను (సీమైన్స్) ఇరాన్ అమర్చుతోందని తమకు సమాచారం అందిందని అమెరికా ప్రకటించింది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని, సముద్ర మార్గంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని కాపాడేందుకే ఈ దాడులు చేశామని అమెరికా పేర్కొంది.
అమెరికా దాడులను ఇరాన్ ధృవీకరించింది. ఈ దాడుల్లో తమ సైనికులు పలువురు మరణించారని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా చర్యకు ప్రతీకారంగా జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అయితే, ఆ క్షిపణులను అమెరికా వైమానిక దళం అడ్డుకున్నట్లు సమాచారం.
సోమవారం తెల్లవారుజామున ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తమ దేశ రక్షణ కోసం చట్టబద్ధమైన ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటామని, ఎటువంటి సైనిక దురాక్రమణకైనా నిర్ణయాత్మకంగా స్పందిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.








