ప్రముఖ హాలీవుడ్ చిత్రం ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’లో జియా పాత్ర పోషించిన కేలీ హాటిల్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఆమె మరణించడం సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది.
జార్జియాలో జన్మించిన కేలీ హాటిల్ కుటుంబ నేపథ్యం ప్రత్యేకమైనది. ఆమె తండ్రి వైపు కుటుంబంలో నాలుగు తరాలుగా వినికిడి సమస్య ఉండటంతో, ఆమె చిన్నప్పటి నుంచే అమెరికన్ సైన్ లాంగ్వేజ్ (ASL)లో ప్రావీణ్యం సంపాదించారు. ఈ భాషా నైపుణ్యమే ఆమె నటనా ప్రయాణంలో కీలక పాత్ర పోషించింది.
2021లో వచ్చిన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ చిత్రంలో కాంగ్‌తో సైన్ లాంగ్వేజ్ ద్వారా ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ సినిమాలో కూడా ఆమె అదే పాత్రలో నటించి మెప్పించారు.
చిన్న వయసులోనే హాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేలీ మరణం తీరని లోటు అని సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు. ఆమె ప్రతిభను గుర్తు చేసుకుంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.







