హర్యానాలో జన్మించిన యుక్తి తరేజా, ఢిల్లీలోని శ్రీ గురు గోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో వాణిజ్యశాఖలో పట్టా పొందింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె, 2017లో 'ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్' పోటీలో పాల్గొనడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత 2019లో ఎంటీవీ 'సూపర్‌మోడల్ ఆఫ్ ది ఇయర్' కార్యక్రమంలో పాల్గొని నాలుగో స్థానంలో నిలిచి దేశవ్యాప్త గుర్తింపును సొంతం చేసుకుంది.
యుక్తి కెరీర్‌లో 2021లో విడుదలైన 'లుట్ గయే' సంగీత వీడియో అతిపెద్ద మలుపుగా నిలిచింది. ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించిన ఈ పాట యూట్యూబ్‌లో వంద కోట్లకు పైగా వీక్షణలను సాధించింది. ఈ వీడియో చిత్రీకరణ సమయంలో మొదట కొంత ఆందోళన చెందినా, ఇమ్రాన్ హష్మీ సహకారంతో ఆ భయం పోయిందని ఆమె పేర్కొంది.
సినిమా అవకాశాల కోసం ముంబైలో వరుస ఆడిషన్లకు హాజరైన యుక్తి, 2023లో నాగశౌర్య సరసన 'రంగబలి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. భాష తెలియకపోయినా డైలాగులను ప్రాక్టీస్ చేసి, పాత్రలోని భావాన్ని అర్థం చేసుకుని నటించడం తనకు నటిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని ఆమె తెలిపింది. నందమూరి కళ్యాణ్‌రామ్ 'డెవిల్' చిత్రానికి మొదట ఎంపికైనా, కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం దక్కలేదని, అయితే పరిశ్రమలో ఇలాంటి మార్పులు సహజమని ఆమె అభిప్రాయపడింది.
ప్రస్తుతం యుక్తి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఉన్ని ముకుందన్ సరసన 'మార్కో' చిత్రంతో మలయాళంలోకి అడుగుపెట్టిన ఆమె, తెలుగులో 'కింగ్ జాకీ క్వీన్'తో పాటు కన్నడ నటుడు నిఖిల్ కుమారస్వామి చిత్రంలోనూ నటిస్తోంది. పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాలను అంగీకరించాలని నిర్ణయించుకున్న యుక్తి, ప్రతి తిరస్కరణ తనను మరింత బలంగా మారుస్తుందని నమ్ముతోంది.








