ఆహారం తీసుకున్న తర్వాత కడుపులో భారంగా అనిపించడం, గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడటం నేటి కాలంలో చాలామందిలో కనిపిస్తోంది. ఆహారం జీర్ణమయ్యే క్రమంలో గ్యాస్ ఉత్పత్తి కావడం సహజమే అయినా, అది పరిమితికి మించితే మాత్రం మన దినచర్యను ఒక్కసారి పరిశీలించుకోవాలని మెడ్‌లైన్ ప్లస్ నివేదిక హెచ్చరిస్తోంది.

మనం తెలియకుండా చేసే కొన్ని పనులే గ్యాస్ పెరగడానికి కారణమవుతున్నాయి. త్వరత్వరగా ఆహారం మింగడం, తింటున్నప్పుడు మాట్లాడటం వల్ల ఆహారంతో పాటు గాలి కూడా పొట్టలోకి చేరుతుంది. అలాగే చూయింగ్ గమ్స్, చాక్లెట్లు, హార్డ్ క్యాండీలు తీసుకోవడం, స్ట్రా ద్వారా కూల్ డ్రింక్స్ తాగడం, సోడాలు సేవించడం వల్ల కడుపులోకి గాలి ఎక్కువగా వెళ్తుంది. క్యాబేజీ, బ్రోకలీ, బీన్స్, ఉల్లిపాయలు, ఆపిల్స్, పియర్స్ వంటి ఆహార పదార్థాలు, కొన్ని సందర్భాల్లో పాలు, డైరీ ఉత్పత్తులు కూడా కొందరిలో గ్యాస్ సమస్యను పెంచుతాయి.

ఈ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆహారాన్ని బాగా నమిలి, నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోవాలి. భోజనం చేసే సమయంలో అనవసరంగా మాట్లాడటం మానేయాలి. ఏ పదార్థాలు తిన్నప్పుడు గ్యాస్ ఎక్కువవుతుందో గమనించి, వాటిని కొన్ని రోజుల పాటు పక్కన పెట్టడం మంచిది. రోజులో తగినంత నీరు తాగడంతో పాటు, తిన్న వెంటనే పడుకోకుండా కాసేపు తేలికపాటి నడక చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఒకవేళ పాలు లేదా డైరీ ఉత్పత్తుల వల్ల గ్యాస్ వస్తుంటే, వైద్యులను సంప్రదించి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. సాధారణ గ్యాస్ సమస్య పెద్ద ప్రమాదకరం కాకపోయినా, పదే పదే తీవ్రమైన ఇబ్బందులు ఎదురైతే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్, సీలియాక్ డిసీజ్ లేదా లాక్టోజ్ ఇంటాలరెన్స్ వంటి జీర్ణకోశ వ్యాధులకు సంకేతం కావచ్చు కాబట్టి, వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.