గోళ్లలో పేరుకుపోయే మురికి, బ్యాక్టీరియా వల్ల కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. అయితే, మనం గోళ్లు కత్తిరించుకోవడానికి వాడే నెయిల్ కట్టర్ కేవలం ఆ ఒక్క పనికే కాకుండా, రోజువారీ పనులకు ఉపయోగపడే మినీ మల్టీ టూల్ కిట్‌లా పనిచేస్తుంది.
నెయిల్ కట్టర్‌ను పూర్తిగా తెరిచినప్పుడు అందులో చిన్న కత్తి వంటి పరికరం కనిపిస్తుంది. ఇది పార్సిల్స్, టేపులను కత్తిరించడానికి లేదా చిన్న పండ్లను కోయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, పల్చటి వస్తువులకు రంధ్రాలు చేయడానికి కూడా ఈ పదునైన భాగాన్ని వాడుకోవచ్చు.
ఇందులో ఉండే మరో వంపు తిరిగిన పరికరం కూల్‌డ్రింక్ లేదా గాజు సీసాల మూతలను తీసే బాటిల్ ఓపెనర్‌గా పనిచేస్తుంది. దీని కొన భాగం సూదిగా ఉండటం వల్ల గోళ్ల లోపలి మురికిని శుభ్రం చేయడానికి కూడా ఇది తోడ్పడుతుంది. అయితే, చర్మానికి గాయం కాకుండా జాగ్రత్తగా ఉండటం అవసరం.
గోళ్ల అంచులను నునుపుగా మార్చే గరుకు భాగంతో పాటు, ఈ అదనపు సాధనాలు అత్యవసర సమయాల్లో ఎన్నో పనులను సులభతరం చేస్తాయి. వీటిని సరిగ్గా గుర్తించి వాడుకోవడం వల్ల నెయిల్ కట్టర్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.








