గోల్కొండ కోటలోని రాణీ మహల్ లాన్స్‌లో శనివారం ఉదయం 10 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకల నేపథ్యంలో రామదేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వైపు వెళ్లే రహదారిని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాధారణ వాహనాల కోసం మూసివేస్తారు.

కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితులు తమ వాహనాల విండ్‌షీల్డ్ (కారు ముందు అద్దం) ఎడమవైపున సంబంధిత కార్ పాస్‌లను స్పష్టంగా కనిపించేలా అంటించుకోవాలి. A, B, C, D, E కేటగిరీల పాస్‌లు ఉన్నవారికి పోలీసులు వేర్వేరు పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు. ఆహ్వానితులు తమ పాస్‌ల ఆధారంగా నిర్ణీత మార్గాల్లోనే ప్రయాణించాలని పోలీసులు స్పష్టం చేశారు.

ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేడుకలు ముగిసే సమయంలో ట్రాఫిక్ మళ్లింపులు మరింత కఠినంగా ఉంటాయి. ఈ సమయంలో సెవెన్ టాంబ్స్, లంగర్ హౌస్ వైపు నుంచి వచ్చే వాహనాలను వేర్వేరు జంక్షన్ల వద్ద దారి మళ్లిస్తారు.

ప్రధాన రహదారులపై వాహనాలను పార్క్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. అత్యవసర సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా ఖాతాలను చూడవచ్చు లేదా 9010203626 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.