నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ఖండవల్లిలోని శ్రీ సర్వోదయ విద్యానికేతన్ విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. జాతీయ భావనను, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటిచెప్పేలా 333 మంది విద్యార్థులు ఏకకాలంలో 'జయహో ధరణి జయహో' అనే నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శన గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. విద్యార్థుల ప్రదర్శనను వీక్షించిన అనంతరం, రికార్డు సాధించిన విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యానికి ఆయన ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిని కాపాడుతూ పర్యావరణంపై చైతన్యం కల్పించే కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ నృత్య రూపకం కేవలం ప్రదర్శన మాత్రమే కాదని, ప్లాస్టిక్ రహిత సమాజం, మొక్కల సంరక్షణ వంటి అంశాలపై ప్రజలకు బలమైన సందేశాన్ని ఇచ్చిందని ఆయన కొనియాడారు.
చిప్కో ఉద్యమం అందించిన స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని మంత్రి సూచించారు. ఈ రికార్డు సాధనలో కృషి చేసిన గేయరచయిత కృష్ణ, జానపద కళాకారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆయన అభినందించారు. విద్యార్థుల ఈ కృషి భవిష్యత్తులో మరికొంతమందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.







