సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శనివారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం సతీశ్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. గౌరవెల్లి రిజర్వాయర్‌పై పర్యావరణ ఉల్లంఘనలను పర్యవేక్షించే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ విషయాన్ని విస్మరించి కాంగ్రెస్ నాయకులు పటాకులు కాల్చుకోవడం వారి తొందరపాటుకు నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు.
గత రెండున్నరేళ్లుగా ప్రాజెక్టు పనుల్లో కనీస పురోగతి లేదని సతీశ్‌కుమార్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ప్రాజెక్టును పూర్తి చేసి ట్రయల్ రన్ ద్వారా నీటిని నింపామని, అప్పట్లో కాంగ్రెస్ నాయకులే NGTలో కేసులు వేయించారని ఆయన తెలిపారు. ఇప్పుడు ఆ కేసులే వారి మెడకు చుట్టుకున్నాయని, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ కేసును ఎత్తివేయించడంలో విఫలమయ్యారని విమర్శించారు.
కేవలం రోడ్లపై బొమ్మలు, పార్కుల నిర్మాణం వల్ల ప్రజల సాగు, తాగునీటి సమస్యలు తీరవని ఆయన స్పష్టం చేశారు. చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు మిడ్ మానేరు ప్రాజెక్టు ద్వారా, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని అందించాలని మంత్రిని కోరారు.
గౌరవెల్లి కేసును త్వరగా పరిష్కరించి హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల రైతులకు నీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తలెత్తితే ప్రజలు చేసే ఆందోళనలకు మంత్రి పొన్నం ప్రభాకరే బాధ్యత వహించాల్సి ఉంటుందని సతీశ్‌కుమార్ హెచ్చరించారు.








