గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 44.82 లక్షల మందికి ఆసరా పింఛన్లు — అంటే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందించే నెలవారీ ఆర్థిక సాయం — అందించేందుకు రూ.58,696 కోట్లు ఖర్చు చేసింది. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంఖ్యను 41.06 లక్షలకు తగ్గించింది. దీనివల్ల 3,75,702 మంది లబ్ధిదారులు పింఛన్ కోల్పోయారు.
ఎన్నికల ముందు వృద్ధాప్య పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అత్తతో పాటు కోడలికి కూడా పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. కానీ, అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా పింఛన్ల పెంపు అమలు కాలేదు.
ప్రభుత్వ నివేదికల ప్రకారం, ప్రస్తుతం రాష్ట్రంలో 4,20,168 మంది బీడీ కార్మికులు, 3,749 మంది బీడీ టేకేదారులు, 46,646 మంది హెచ్‌ఐవీ పేషెంట్లు, 16,922 మంది ఫైలేరియా బాధితులు, 9,808 మంది డయాలసిస్ రోగులు పింఛన్లు పొందుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు వృద్ధులు, బీడీ కార్మికులు, హెచ్‌ఐవీ బాధితులకు ప్రభుత్వం అవకాశం కల్పించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
పంద్రాగస్టు నుంచే కొత్త పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ నెల 31 వరకు దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, వీటి పరిశీలన ఎప్పుడు జరుగుతుంది, అర్హులను ఎలా ఎంపిక చేస్తారు, పింఛన్ల పంపిణీ ఎప్పటి నుంచి మొదలవుతుందనే అంశాలపై స్పష్టత లేదు.








