రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ (SIR) రిపోర్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ఆయన, ఈ సమయాన్ని ప్రతి నాయకుడు క్షేత్రస్థాయిలో పని చేసేందుకు వినియోగించుకోవాలని సూచించారు. ఈ పది రోజుల పాటు ఎవరూ గాంధీభవన్‌కు రావద్దని ఆయన తేల్చి చెప్పారు.

బూత్ లెవల్ ఏజెంట్స్ (BLA) రిపోర్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వారిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనితీరు సరిగ్గా లేని ఇన్‌చార్జ్‌లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయితే, బాగా పనిచేసిన 100 మంది బీఎల్ఏలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవకాశం కల్పిస్తామని ఆయన ప్రకటించారు.

ఈ సమీక్షలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై చాలా మంది ఎమ్మెల్యేలు సీరియస్‌గా లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలంతా ఈ ప్రక్రియలో యాక్టివ్‌గా పాల్గొనాలని, ఇంచార్జ్ మంత్రులు నిరంతరం ఫాలోఅప్ చేయాలని ఆయన కోరారు. బీఎల్ఏలకు స్థానిక నాయకులు పూర్తి సహకారం అందించాలని సూచించారు.

నియోజకవర్గాల వారీగా అందిన రిపోర్టులపై సీఎం, పీసీసీ చీఫ్ స్పందించారు. 52 నియోజకవర్గాల్లో పనితీరు బాగుందని, 42 నియోజకవర్గాలు పర్వాలేదని గుర్తించారు. అయితే, 21 నియోజకవర్గాల్లో పనితీరు సరిగ్గా లేదని, నాలుగు నియోజకవర్గాల్లో అసలు పనే జరగలేదని రిపోర్టులు రావడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 30న దీనిపై మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.