రాష్ట్రంలో వర్షాలు కురవకుండా మాజీ మంత్రి హరీష్‌రావు క్షుద్ర పూజలు చేయిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై బీఆర్‌ఎస్ తీవ్రంగా స్పందించింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌తో సహా పలువురు కాంగ్రెస్ నేతలు చేసిన ఈ వ్యాఖ్యలను హరీష్‌రావు తప్పుబట్టారు. తన పరువుకు నష్టం కలిగించేలా నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ, సంబంధిత నేతలకు ఆయన లీగల్ నోటీసులు పంపారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఆ నోటీసుల్లో హెచ్చరించారు.
ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ నేతలపై వ్యక్తిగత విమర్శలు పెరగడంతో, పార్టీ ఈ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. గతంలో మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇలాగే లీగల్ నోటీసులు పంపారు. సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రెస్ మీట్లతో ఖండించడం కంటే చట్టపరమైన మార్గమే సమర్థవంతమని పార్టీ భావిస్తోంది. ఆధారాలు లేని విమర్శలను ఇకపై లీగల్ నోటీసులతోనే ఎదుర్కోవాలని బీఆర్‌ఎస్ నిర్ణయించుకుంది.
రాబోయే రెండున్నరేళ్లలో అధికార పార్టీ నుంచి విమర్శలు పెరిగే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. దీనిని ఎదుర్కోవడానికి ప్రత్యేక లీగల్ టీమ్‌ను కూడా సిద్ధం చేసుకుంది. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదని, నోటీసుల ద్వారానే గట్టి కౌంటర్ ఇస్తామని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.







