ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండానే మంత్రి పదవిలో కొనసాగుతున్న బీహార్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దీపక్ ప్రకాష్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరు నెలల గడువు ముగిసినా ఆయన మంత్రిగా ఎలా కొనసాగుతున్నారో చెప్పాలని బీహార్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.
నిబంధనల ప్రకారం ఏ మంత్రి అయినా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి. అయితే, దీపక్ ప్రకాష్ విషయంలో ఈ నిబంధన అమలు కాలేదని కోర్టు గమనించింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీపక్ ప్రకాష్ 2025 నవంబర్‌లో నితీశ్ కుమార్ కేబినెట్‌లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2026 ఏప్రిల్ 25 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత నితీశ్ కుమార్ రాజీనామా చేయడంతో కేబినెట్ రద్దయింది. అనంతరం సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు, దీపక్ ప్రకాష్ మళ్లీ మంత్రిగా ప్రమాణం చేశారు.
ఈ నేపథ్యంలో, ఎన్నిక కాకుండానే మంత్రిగా కొనసాగుతున్న తీరుపై సుప్రీంకోర్టు వివరణ కోరడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.







