విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారైల నుంచి ఇల్లు లేదా ఫ్లాట్ వంటి స్థిరాస్తులను కొనుగోలు చేసే భారతీయులకు ఉపశమనం లభించనుంది. ప్రస్తుతం ఎన్నారైల నుంచి ఆస్తులు కొనే రెసిడెంట్ వ్యక్తులు లేదా హిందూ అవిభక్త కుటుంబం (HUF) టీడీఎస్ మినహాయించేందుకు ముందుగా టాన్ (Tax Deduction and Collection Account Number - TAN) తీసుకోవడం తప్పనిసరి. అయితే, ఈ అదనపు నిబంధనను అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వం తొలగించనుంది.
ఈ మార్పు అమల్లోకి వచ్చిన తర్వాత, అర్హత కలిగిన రెసిడెంట్ వ్యక్తులు లేదా హెచ్‌యూఎఫ్ కేవలం తమ పాన్ (PAN) ఆధారంగానే టీడీఎస్ చెల్లించేందుకు వీలుంటుంది. దీనివల్ల ఆస్తి కొనుగోలు లావాదేవీ కోసం ప్రత్యేకంగా టాన్ పొందాల్సిన అవసరం ఉండదు. 2026 బడ్జెట్‌లో ఈ మార్పును ప్రతిపాదించినట్లు ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.
అయితే, అక్టోబర్ 1 వరకు ప్రస్తుత నిబంధనలే కొనసాగుతాయి. 2026 సెప్టెంబర్ 30 వరకు ఎన్నారై నుంచి ఆస్తి కొనుగోలు చేసే వారు టీడీఎస్ బాధ్యతను నెరవేర్చడానికి తప్పనిసరిగా టాన్ పొందాలి. అలాగే, టీడీఎస్‌ను మినహాయించి ప్రభుత్వానికి జమ చేసి, సంబంధిత టీడీఎస్ స్టేట్‌మెంట్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఎన్నారై విక్రేతల విషయంలో టీడీఎస్ నిబంధనలు రెసిడెంట్ విక్రేతలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. ఎన్నారైకు చెల్లించే మొత్తంపై టీడీఎస్ రేట్లు, విక్రేతకు వచ్చే మూలధన లాభాల ఆధారంగా నిర్ణయిస్తారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025లోని సెక్షన్ 393లో ఈ నిబంధనలను పొందుపరిచారు. కొత్త చట్టంలో టీడీఎస్ నిబంధనలను సరళీకరించినప్పటికీ, రేట్లు మరియు పరిమితుల్లో ఎటువంటి మార్పులు లేవని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.







