గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన డాక్టర్ ప్రియాంక సోమవారం కన్నుమూశారు. రాజమండ్రిలోని జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె, ఈ నెల 3న రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.

ప్రియాంక మృతితో ఎక్లాస్‌పూర్ గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఆమెను కడసారి చూసేందుకు స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ ప్రముఖులు భారీగా తరలిరావడంతో గ్రామం జనసంద్రంగా మారింది. ఆమె తండ్రి వెంకటేష్ పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పాల్గొన్నారు.

తన కుమార్తెను మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారని తండ్రి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఎంతో కష్టపడి చదివించిన తన కుమార్తె మరణం తీరని లోటని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ ఘటనపై ఏపీ మంత్రి టీజీ భరత్ స్పందిస్తూ, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుందని ఆయన తెలిపారు. అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి, ప్రియాంక కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందజేశారు.