మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ సర్కిల్ డీ పోచంపల్లిలో ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి సోమవారం భూమిపూజ జరిగింది. మెట్రోపాలిటన్ ఏరియా అండ్ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారికి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు రౌండ్ టేబుల్ ఇండియా చేస్తున్న కృషిని అభినందించారు. ఈ పాఠశాల నిర్మాణం పూర్తయితే వేలాది మంది పిల్లలకు చదువుకునే అవకాశం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
నిర్ణీత గడువులోగా పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని జయేష్ రంజన్ నిర్వాహకులను కోరారు. ఈ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ ప్రాంతంలో దారిద్య్రరేఖకు దిగువన (అత్యంత పేదరికంలో) సుమారు ఏడు వేల కుటుంబాలు నివసిస్తున్నాయని రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా చైర్మన్ అనిరుధ్ సోంపల్లి తెలిపారు. వీరంతా చదువు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని గుర్తించి, వారికి అందుబాటులో ఉండేలా ఈ పాఠశాలను నిర్మిస్తున్నామని చెప్పారు.
ఈ పాఠశాలలో విశాలమైన గదులతో పాటు లైబ్రరీ, ల్యాబ్స్ వంటి సౌకర్యాలు ఉంటాయని నిర్వాహకులు వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో విద్యార్థులకు బోధన అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా ప్రతినిధులు అభిషేక్ అగర్వాల్, బి.లోకేశ్వరెడ్డి, కౌశిక్ యక్కల, నిర్మల్ ఉప్పుగుండ్ల పాల్గొన్నారు.








