నీలాద్రి ప్రొడక్షన్స్ మరియు పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రమేష్ వర్మ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ ఒక సినిమాను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాతలు ధృవ్ కు కోటి రూపాయల అడ్వాన్స్ చెల్లించడంతో పాటు, ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం భారీగా ఖర్చు చేశారు.

అయితే, షూటింగ్ ప్రారంభం కావాల్సిన సమయంలో ధృవ్ విక్రమ్ మైత్రీ మూవీ మేకర్స్ తో కొత్త సినిమాను ప్రకటించారు. రమేష్ వర్మ సినిమా పూర్తయ్యాకే ఇతర ప్రాజెక్టులు చేయాలని నిర్మాతలు కోరినా, ధృవ్ నుంచి సరైన స్పందన లేదని వారు పేర్కొన్నారు. మైత్రీ మూవీస్ సినిమా తర్వాతే చేస్తానని ధృవ్ చెబుతున్నారని, దీనివల్ల తమకు వడ్డీల భారం పెరుగుతోందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు చెప్పకుండానే మరో నిర్మాతతో సినిమా మొదలుపెట్టడం మోసపూరిత చర్య అని పేర్కొంటూ నిర్మాతలు తమిళ ఫిలిం ఛాంబర్ ను ఆశ్రయించారు. గతంలో కూడా మురుగదాస్, మణిరత్నం దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ సినిమాలు మొదలై ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో, తాజా వివాదంపై తమిళ ఫిలిం ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

మరోవైపు, వ్యక్తిగత జీవితంలో కూడా ధృవ్ విక్రమ్ వార్తల్లో నిలిచారు. నటి అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా వేదికగా ధృవ్ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా బ్రేకప్ గురించి పోస్ట్ చేశారు. వరుస వివాదాలు, సినిమా అవకాశాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ధృవ్ విక్రమ్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.