నీట్ (NEET) పేపర్ లీకేజీ ఘటనపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, సీజేపీ (Cockroach Janta Party) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే గత నెల రోజులకు పైగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు, రాజకీయ నాయకుల నుంచి మద్దతు లభించింది. శనివారం కేంద్రమంత్రి రాజీనామా చేయడంతో ఈ పోరాటం విజయవంతమైందని అభిజిత్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో అనితా దీప్కే మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడి నిజాయితీ పోరాటానికి చివరకు ఫలితం దక్కిందని చెప్పారు. తన లక్ష్యం నెరవేరే వరకు అభిజిత్ వెనక్కి తగ్గలేదని ఆమె తెలిపారు. అయితే, ఢిల్లీలో నిరసన జరుగుతున్న సమయంలో కుటుంబం తీవ్ర ఆందోళన చెందిందని ఆమె వెల్లడించారు.

ముఖ్యంగా జైపూర్‌లో అభిజిత్‌పై దాడి జరిగి, చెంపదెబ్బ కొట్టిన ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని అనితా దీప్కే గుర్తు చేసుకున్నారు. ఆ ఘటన జరిగిన రాత్రంతా తాము నిద్రపోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బంధుమిత్రులతో కలిసి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకుంటామని, అతనికి ఘన స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నామని ఆమె తెలిపారు.