గురువారం ఆగస్ట్ 20న జరిగిన ఈ సమావేశంలో సీఎం విజయ్ మాట్లాడుతూ, దేశ ఆర్థికాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర కీలకమని చెప్పారు. దేశ జీడీపీలో (దేశంలో తయారైన వస్తువులు, సేవల మొత్తం విలువ) ఈ రాష్ట్రాల వాటా 30 శాతానికి పైగా ఉందని ఆయన గుర్తుచేశారు. తయారీ, ఎగుమతులు, సేవలు, ఆవిష్కరణల్లో దక్షిణాది రాష్ట్రాలను సమగ్ర ఆర్థిక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని, ఇందుకోసం ఉమ్మడి పారిశ్రామిక కారిడార్లు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయాలని కోరారు.
రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్ (NEET) నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని సీఎం విజయ్ డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS), ఆయుష్ (AYUSH) కోర్సుల్లో రాష్ట్ర కోటా సీట్లను 12వ తరగతి మార్కుల ఆధారంగానే భర్తీ చేయాలని ఆయన కోరారు. అలాగే, కావేరి నదీ జలాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను, అథారిటీ నిర్ణయాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలను డీలిమిటేషన్‌తో శిక్షించకూడదని, పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలను పరస్పర గౌరవం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
డ్రగ్స్ రవాణా, తయారీ, పంపిణీని అరికట్టేందుకు రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండాలని సీఎం విజయ్ పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ప్రిస్క్రిప్షన్ (డాక్టర్ రాసిచ్చిన మందుల చీటీ) లేకుండా మందుల అక్రమ విక్రయాలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 1,076 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న తమిళనాడు, బ్లూ ఎకానమీ (సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ)లో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు.
జీఎస్టీ (వస్తు సేవల పన్ను) అమలు తర్వాత రాష్ట్రాల సొంత పన్ను ఆదాయ వనరులు పరిమితమయ్యాయని ఆయన గుర్తుచేశారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు ఆర్థికంగా నష్టం జరగకుండా, రాష్ట్రాలకు న్యాయమైన ఆర్థిక వాటాను కల్పించాలని కోరారు. బలమైన రాష్ట్రాలతోనే బలమైన భారత్ నిర్మాణం సాధ్యమని ఆయన నొక్కిచెప్పారు.







