రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 మంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఆంతరంగికుడు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి అండగా నిలబడి, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారిపై ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు. ఇలా మాట్లాడే వారి ఫైళ్లను శరవేగంగా క్లియర్ చేస్తామని ఆయన హామీ ఇస్తున్నట్లు తెలిసింది.
ప్రధానంగా నల్లగొండ, వరంగల్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఈ ఫోన్లు వెళ్లాయి. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఒక ఎమ్మెల్యే ఫైల్‌ను, ప్రెస్‌మీట్ పెట్టిన వెంటనే క్లియర్ చేయాలని ఆ ఆంతరంగికుడు ఒక అధికారిని ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సదరు ఎమ్మెల్యే మరో యువ ఎమ్మెల్యేతో స్వయంగా పంచుకున్నారు.
అయితే, ఈ ప్రతిపాదనపై తొలుత చాలామంది ఎమ్మెల్యేలు ముందుకు రాలేదు. దీంతో ఆ ఆంతరంగికుడు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి, తమ పీఆర్వోలు (ప్రభుత్వ ప్రజా సంబంధాల అధికారులు) పంపే నోట్‌ను చదివి ప్రెస్‌మీట్ పెట్టాలని సూచిస్తున్నారు. ఫైల్ క్లియర్ కావాలంటే ప్రెస్‌మీట్ పెట్టడం ఒక్కటే మార్గమని ఆయన ఎమ్మెల్యేలకు చెబుతున్నారు.
మరోవైపు, మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలకు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టేందుకు తగినంత మంది ఎమ్మెల్యేలు రాకపోవడంపై ముఖ్యనేత అసంతృప్తిగా ఉన్నారు. కేవలం 20 మంది కూడా రాకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
తనకు అనుకూలంగా మంత్రులు, సీనియర్ నేతలు స్పందించకపోవడంపై ముఖ్యనేత ఇప్పటికే కొందరు నేతలతో చర్చలు జరిపారు. తన మాట వినని వారిని తగిన సమయంలో ఎలా డీల్ చేయాలో తనకు తెలుసని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.








