గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ దారుణంపై శనివారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
బుధవారమే ఈ ఘటన జరిగినా, మూడు రోజుల పాటు ప్రభుత్వం దీనిని కప్పిపెట్టిందని జగన్ ఆరోపించారు. బాధిత మహిళ ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో వీడియోలు బయటకు వచ్చిన తర్వాతే ప్రభుత్వం చర్యల పేరుతో హడావుడి చేస్తోందని ఆయన విమర్శించారు.
పోలీస్ స్టేషన్లు బాధితులకు రక్షణ కల్పించకుండా, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నాయని జగన్ ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదును పట్టించుకోకుండా పంచాయితీలు చేయడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. రెడ్‌బుక్ పాలన పేరుతో రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని, దీనివల్ల అధికార పార్టీ నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ తీరుపై మహిళల ఆగ్రహం త్వరలోనే తగిన బుద్ధి చెబుతుందని జగన్ హెచ్చరించారు. చట్టాన్ని అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకుని, పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా వాడుతున్నారని ఆయన విమర్శించారు.







