ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్‌లో మేడారం చేరుకుంటారు. అక్కడ సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నాక, చేయూత పింఛనుదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించి, ములుగు జిల్లాలో తన పర్యటనను కొనసాగిస్తారు.
ములుగులో గట్టమ్మ ఆలయం వద్ద రూ. 16,007 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే పంచాయతీరాజ్ రహదారుల (హ్యామ్ రోడ్లు) అభివృద్ధికి సీఎం పైలాన్ ఆవిష్కరిస్తారు. వీటితో పాటు రూ. 868 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు, రూ. 63.50 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని (కలెక్టరేట్) ఆయన ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా పరకాలకు చేరుకుని, అక్కడ రూ. 484.42 కోట్ల వ్యయంతో పలు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో భాగంగా తాగునీటి సరఫరా, ఆసుపత్రి భవనం, డిగ్రీ కళాశాల, విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఫోర్ లేన్ రహదారి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం నిర్మించే సమగ్ర నివాస పాఠశాల) వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.
ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రి సీతక్క నేతృత్వంలో అధికారులు, పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆత్మకూర్ మండలం అక్కంపేటను ఆదర్శ గ్రామంగా మార్చేందుకు ప్రత్యేక నిధుల కేటాయింపుతో సీఎం పర్యటన ముగుస్తుంది.








