తమిళనాడుకు చెందిన దర్శకుడు, నిర్మాత కస్తూరి రాజా కుమారుడైన ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. నిజానికి ధనుష్‌కు నటుడు కావాలనే ఆలోచన లేదు, ఆయన చెఫ్ కావాలని ఆశపడ్డారు. అయితే, తన తండ్రి మరియు సోదరుడు సెల్వరాఘవన్ ఒత్తిడి మేరకు ఆయన కెమెరా ముందుకు రావాల్సి వచ్చింది.

2002లో ‘తుళ్లువదో ఇళమై’ చిత్రంతో ధనుష్ సినీ ప్రస్థానం మొదలైంది. 2011లో వచ్చిన ‘3’ సినిమాలోని “వై దిస్ కొలవెరి డి” పాట ఆయనకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ పాటను ఆయనే స్వయంగా రాసి పాడటం విశేషం. ఆ తర్వాత 2013లో ‘రాంఝానా’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించి, ‘అతరంగి రే’, ‘షమితాబ్’ వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

నటుడిగానే కాకుండా, ‘పా పాండి’ చిత్రంతో దర్శకుడిగా మారిన ధనుష్, తన ‘వండర్‌బార్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించారు. ‘ఆడుకాలం’, ‘అసురన్’ చిత్రాలకు గాను ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. నిర్మాతగా ఆయన నిర్మించిన ‘కాక ముట్టై’, ‘విసరణై’ చిత్రాలు కూడా జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నాయి.

అంతర్జాతీయ స్థాయిలోనూ ధనుష్ తన ముద్ర వేశారు. ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ మరియు నెట్‌ఫ్లిక్స్ యాక్షన్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’ వంటి హాలీవుడ్ ప్రాజెక్టుల్లో ఆయన నటించారు. వ్యక్తిగత జీవితానికి వస్తే, 2004లో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్న ధనుష్‌కు యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్య విడిపోయారు.