మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం రాత్రి చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాల రికార్డులను, ప్రాంగణాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఎమ్మెల్యే మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన ఉచిత వైద్యం అందించాలని వైద్యులను, సిబ్బందిని ఆయన ఆదేశించారు.

పట్టణంలో జరుగుతున్న 100 పడకల కొత్త ఆసుపత్రి భవన నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించారు. భవనం నిర్మాణం చివరి దశలో ఉన్నందున, పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులు, పరిసరాల శుభ్రతను వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.

త్వరలోనే ఈ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ఇందుకోసం అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, పలువురు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.