ChatGPT వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (అంటే భారీ డేటాతో శిక్షణ పొంది, మనుషుల్లా సమాధానాలు ఇచ్చే AI సాఫ్ట్‌వేర్) వాడకంపై 2025లో MIT పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. ఇందులో 54 మందిని మూడు గ్రూపులుగా విభజించి, నాలుగు నెలల పాటు మూడు సెషన్లలో పరీక్షించారు.
మొదటి గ్రూపు ChatGPTని, రెండో గ్రూపు సెర్చ్ ఇంజిన్‌ను వాడగా, మూడో గ్రూపు ఎలాంటి సహాయం లేకుండా సొంతంగా వ్యాసాలు రాసింది. పరిశోధకులు EEG (మెదడులోని విద్యుత్ తరంగాలను కొలిచే పరికరం) ద్వారా వారి మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని, రచనపై ఆసక్తిని విశ్లేషించారు.
ఈ పరీక్షల్లో ChatGPT వాడిన గ్రూపులో ఇతర గ్రూపులతో పోలిస్తే మెదడు కనెక్టివిటీ తక్కువగా ఉన్నట్లు తేలింది. తాము రాసిన వ్యాసాల్లోని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడంలో వీరు ఇబ్బంది పడ్డారు, అలాగే తమ రచనపై సొంతం అనే భావన కూడా వీరిలో తక్కువగా కనిపించింది.
అయితే, ఈ ఫలితాలను ప్రాథమికమైనవిగా మాత్రమే చూడాలని MIT స్పష్టం చేసింది. ఈ అధ్యయనం ఇంకా పీర్ రివ్యూడ్ జర్నల్‌లో (అంటే ఇతర నిపుణులు పరిశీలించి ధృవీకరించిన పత్రికలో) ప్రచురితం కాలేదు, పైగా ఇది కేవలం వ్యాస రచనకు మాత్రమే పరిమితమైంది.
కాబట్టి, ChatGPT వాడితే ప్రతి సందర్భంలోనూ మెదడు సామర్థ్యం తగ్గుతుందని చెప్పలేమని పరిశోధకులు చెబుతున్నారు. సాంకేతికత మన పనిని సులభతరం చేయాలి కానీ, మన ఆలోచనా శక్తిని భర్తీ చేయకూడదని వారు సూచిస్తున్నారు.
ఏదైనా సమాచారం కోసం ముందుగా సొంతంగా ఆలోచించి, ఆ తర్వాతే AIని అసిస్టెంట్‌గా వాడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. సొంతంగా ఆలోచించిన తర్వాత, మరింత లోతైన విషయాలను తెలుసుకోవడానికి మాత్రమే AIని ఉపయోగించాలని వారు సూచిస్తున్నారు.








