శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్ సహా పలువురిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదైంది. శ్రీకాకుళం సమీపంలోని చాపురం సత్యసాయి నగర్‌లో 900 గజాల భూమిని అక్రమంగా కాజేశారనే ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.

ఈ భూమి అసలు యజమాని అందవరపు గోవిందరాజులు బతికి ఉండగానే, ఆయన మరణించినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమదాలవలస సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పుడు పత్రాలను సమర్పించి, సుమారు రూ.4 కోట్ల విలువైన ఆస్తిని తమ పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గోవిందరాజుల అల్లుడు కనకలింగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అప్పటి ఆమదాలవలస సబ్-రిజిస్ట్రార్ బొడ్డేపల్లి అరుణపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితులపై దర్యాప్తు కొనసాగుతోంది.