మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివునూర్ గ్రామంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిని మూసివేస్తూ కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారనే కారణంతో గ్రామస్తులు ఆ గోడను కూల్చివేశారు.
వందల ఏళ్లుగా తాము ఈ దారి గుండానే తమ వ్యవసాయ భూములకు వెళ్తున్నామని గ్రామస్తులు తెలిపారు. అయితే, ఈ దారిని ఆక్రమించి గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టారని వారు ఆరోపించారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తయితే తమకు పొలాలకు వెళ్లే మార్గం లేకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కూడా ఈ విషయంపై తాము ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించకుండానే నిర్మాణం కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ వారు కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేశారు.







