భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం బూర్గంపాడు గ్రామం నుండి సారపాక వరకు ఉన్న ప్రధాన ఆర్ అండ్ బి రహదారి సుమారు 2.5 కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతింది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
ఈ రహదారి గుండా నిత్యం వందలాది బస్సులు, నిత్యావసర వస్తువులను రవాణా చేసే వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు అధ్వాన్నంగా ఉండటంతో అంబులెన్స్‌లు కూడా సకాలంలో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయంలో రోగులను ఆసుపత్రికి తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు చెబుతున్నారు. రహదారి పక్కన అక్రమంగా ఇళ్లు, దుకాణాల నిర్మాణాలు జరుగుతున్నా ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడం లేదని జిల్లా వ్యవసాయ కూలీ సంఘం నాయకులు పూన్నం చందు విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రజల ప్రాణాల దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చి, రోడ్డును పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. ఒకవేళ అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పూన్నం చందు హెచ్చరించారు.








