మేడిపల్లి మండల పరిధిలోని సర్వే నంబర్ 103లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిపై ఒక నాయకుడు కన్నేశారు. తన అనుచరులతో కలిసి ఈ భూమిని ఆక్రమించి, అక్కడ ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
స్థానికంగా ఉన్న నిరుపేదలను ఆ నాయకుడు నమ్మిస్తున్నారు. వారికి భూములు ఇప్పిస్తామని, ఇళ్లు కట్టిస్తామని చెప్పి వారి వద్ద నుంచి లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా ఈ అక్రమాలను అడ్డుకుంటే, తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి వారిని బెదిరిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
ఈ వ్యవహారంపై స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు రెవెన్యూ అధికారులకు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించి, పనులు ఆపాలని ఆదేశాలు ఇచ్చి వెళ్లడం తప్ప, ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు వెళ్లిన మరుసటి రోజు నుంచే మళ్లీ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
అధికారుల పరోక్ష సహకారంతోనే ఈ ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించకపోతే, సర్వే నంబర్ 103లోని భూమి మొత్తం ఆక్రమణదారుల వశం అవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.
ఈ అక్రమాలకు సహకరిస్తున్న నాయకుడిపై, అలాగే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయాలని కోరుతున్నారు.








