బీహార్ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీకి చెందిన సీనియర్ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ శుక్రవారం బీజేపీలో చేరారు. పాట్నాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరౌగి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నిజాయితీతో కూడిన రాజకీయాలకు తివారీ కట్టుబడి ఉంటారని, ఆయన రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని సరౌగి పేర్కొన్నారు.
రాజీనామాకు ముందు జూలై 16న తివారీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 2014లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనను అధికార ప్రతినిధిగా నియమించారని, అప్పటి నుంచి పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీడియాలో సమర్థవంతంగా వాదించానని ఆయన గుర్తు చేశారు. అయితే, లాలూ ప్రసాద్ తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టిన తేజస్వి యాదవ్ చుట్టూ ఉన్న వ్యక్తులపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
తేజస్వి యాదవ్‌తో పార్టీ భవిష్యత్తు గురించి చర్చించినప్పటికీ ఫలితం లేదని తివారీ తెలిపారు. పార్టీలో కొందరు వ్యక్తులు 'చెదపురుగుల్లా' మారి లోపలి నుంచి సంస్థను బలహీనపరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తనకు 'ఊపిరి ఆడని పరిస్థితి' నెలకొందని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.







