ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఉన్న రామలీలా మైదానంలో తన బహిరంగ సభ తర్వాత, బీజేపీ నేతలు హవనం మరియు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారని ఖర్గే రాజ్యసభలో వెల్లడించారు. ఇది దళితుల పట్ల వివక్షను ప్రతిబింబించే చర్య అని, బీజేపీ దళిత వ్యతిరేక మనస్తత్వానికి ఇది నిదర్శనమని ఆయన విమర్శించారు.
ఈ ఆరోపణలపై కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ, ఇలాంటి చర్యలను తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని స్పష్టం చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, తప్పు చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
అయితే, ఈ ఘటనకు మొత్తం పార్టీని బాధ్యురాలిని చేయడం సరికాదని నడ్డా పేర్కొన్నారు. పూర్తి వాస్తవాలు తెలియకుండానే ఆరోపణలు చేయడం బాధాకరమని, పార్టీ అధ్యక్షుడి హోదాలో ఈ అంశాన్ని తాను స్వయంగా పరిశీలిస్తానని ఆయన తెలిపారు.
ఈ వివాదంపై రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ స్పందిస్తూ, అంటరానితనం వంటి వివక్షను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా దీనిని వ్యతిరేకిస్తున్నామని, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.








