ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పరిధిలో ఉన్న ఒక గ్రామంలో రోడ్డు అధ్వాన్నంగా తయారైందని గ్రామస్తులు బీజేపీ ఎమ్మెల్యే ఛోటేలాల్ వర్మను నిలదీశారు. బుధవారం ఫతేహాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఈ వాగ్వాదం జరిగింది.
రోడ్డు ఎన్నో ఏళ్లుగా పాడైపోయిందని గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ, 'ఎక్కువ మాట్లాడితే నిన్ను దారిలోకి తెచ్చేందుకు జైలుకు పంపిస్తా' అని సదరు గ్రామస్తుడిని హెచ్చరించారు.
ఈ ఘటనపై బాధితుడు 'ఆజ్ తక్' అనే వార్తా సంస్థతో మాట్లాడారు. గ్రామ రహదారి పరిస్థితిని సరిచేయాలని కోరుతూ తాను ఎమ్మెల్యేకు పలుమార్లు లేఖలు రాశానని ఆయన తెలిపారు.
మరోవైపు, ఈ ఉదంతంపై ఎమ్మెల్యే ఛోటేలాల్ వర్మ తన వాదనను వినిపించారు. తాను గ్రామానికి పరామర్శకు వెళ్లినప్పుడు కొందరు వ్యక్తులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు.
అంతేకాదు, ఆ వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై అనుచిత పదజాలం ఉపయోగించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.








