బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అగ్రనాయకత్వానికి సమర్పించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజీనామా నిర్ణయం తర్వాత ఆయన తన ఎక్స్ (X) ఖాతాలోని బయో వివరాలను మార్చారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్ బయోలో మాత్రం ఆయన ఇంకా బీజేపీ జాతీయ ప్రతినిధిగానే కొనసాగుతున్నారు.

వృత్తిరీత్యా లాయర్ మరియు పౌరహక్కుల కార్యకర్త అయిన 38 ఏళ్ల పూనావాలా, తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించారు. 2017లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రాహుల్ గాంధీ ఎన్నిక ఒక నాటకమని, పార్టీలో ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత బీజేపీలో చేరి, జాతీయ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు.

గత 18-19 ఏళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నానని, ఇప్పుడు తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని పూనావాలా పేర్కొన్నారు. 2024లో ప్రధాని మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పుడే తాను వైదొలగాలని అనుకున్నానని, అయితే ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ ఎన్నికల దృష్ట్యా తన బాధ్యతలను కొనసాగించానని వివరించారు. ప్రధాని మోదీకి తాను జీవితాంతం మద్దతుదారుగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.