హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో బీసీ గురుకులాలకు అద్దె భారం ఇబ్బందిగా మారింది. సొంత భవనాలు లేకపోవడంతో ఏటా కోట్ల రూపాయలను అద్దెల రూపంలో ప్రైవేట్ బిల్డింగ్‌ల ఓనర్లకు కడుతున్నారు. ఈ అద్దె భారంతో గురుకులాల నిర్వహణ భారంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 327 బీసీ గురుకుల స్కూల్స్, 294 ఇంటర్ కాలేజీలు, 33 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి.

ఇందులో ఏటా రెండున్నర లక్షల మంది చదువుతున్నారు. అయితే, 327 స్కూళ్లకుగాను కేవలం 25 స్కూళ్లు మాత్రమే సొసైటీ సొంత బిల్డింగ్స్‌లో ఉన్నాయి. మిగతావన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. స్కూళ్లతోపాటు, ఇంటర్, డిగ్రీ కాలేజీలకు ఏటా రూ. 120 కోట్లను అద్దె రూపంలో కడుతున్నారు.

రాష్ర్ట ఆవిర్భావం తరువాత బీసీ గురుకులాల స్కూళ్లు, కాలేజీల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి బీసీ గురుకుల సొసైటీ అధికారులు పలు సార్లు విన్నవించారు. అయితే గత సర్కారు ఈ ప్రతిపాదనలను పట్టించుకోలేదు. పదేండ్లలో కేవలం 5 మాత్రమే బిల్డింగ్స్ నిర్మించారని అధికారులు చెబుతున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో రూ. 30 కోట్ల వ్యయంతో లక్ష ఎస్ఎఫ్‌టీ విస్తీర్ణంలో బీసీ గురుకుల సొసూటీకి సొంతంగా భారీ భవనం నిర్మించారు. ఇందులో స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, సిబ్బంది అంతా కలిపి 800 మంది ఉంటున్నారు. ఏటా ఈ స్కూల్ అడ్మిషన్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ సీట్లు ఇవ్వాలని ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేల నుంచి ఎక్కువగా రెకమండేషన్ లెటర్లు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

భవన నిర్మాణాలకు అనుమతి కోసం లేఖ సొంత భవనాలు లేకపోవడంతో ఏటా అద్దె రూపంలో భారీగా నిధులు ఖర్చు అవుతున్నాయి. అద్దె బకాయిలు కూడా సకాలంలో ప్రభుత్వం విడుదల చేయకపోవటంతో ఓనర్లు గత ఏడాది ఆందోళన చేసి స్కూళ్ల గేట్లకు తాళాలు వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని అద్దె బకాయిలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 33 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున తొలి దశలో సొంత భవనాలు నిర్మించాలని బీసీ గురుకుల సోసైటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

ఒక్కో గురుకుల భవన ప్రాంగణానికి 5 ఎకరాల స్థలంతో పాటు, నిర్మాణానికి రూ. 30 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 33 జిల్లాల్లో ల్యాండ్ గుర్తించామని, ఈ వివరాలను ప్రభుత్వానికి పంపించామని ఓ అధికారి తెలిపారు.

ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే ఏడాది జూన్ వరకు కొన్ని పూర్తి చేయొచ్చని చెప్పారు. సొంత భవనాలు నిర్మిస్తే ఏటా అద్దె రూపంలో చెల్లిస్తున్న రూ. 120 కోట్ల భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా, విద్యార్థులకు మెరుగైన వసతులతో కూడిన విద్యను అందించవచ్చని సొసైటీ అధికారులు పేర్కొంటున్నారు.