ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ సభ్యుడిగానే కొనసాగుతున్నారని, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ హైకోర్టుకు తెలిపారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ జరిపింది.

కేవలం మీడియాలో వచ్చిన ఫొటోలు, వార్తా కథనాల ఆధారంగా ఒక ఎమ్మెల్యే పార్టీ మారారని నిర్ధారించడం సరికాదని న్యాయవాది వాదించారు. దానం నాగేందర్ ముఖ్యమంత్రిని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిని కలిసినప్పుడు ఆయన మెడలో కాంగ్రెస్ కండువా వేసినంత మాత్రాన, ఆయన స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్‌ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు కాదని పేర్కొన్నారు. అసలు అనర్హత పిటిషన్‌లో లేని అంశాలను అదనపు అఫిడవిట్ ద్వారా చేర్చడం చట్టబద్ధం కాదని ఆయన వివరించారు.

దానం నాగేందర్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయలేదని, ఆ పార్టీ ఆయన్ను బహిష్కరించలేదని లేదా సస్పెండ్ చేయలేదని న్యాయవాది స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సభ్యత్వ రుసుమును దానం చెల్లించారని, ఆ పార్టీ దాన్ని స్వీకరించిందని గుర్తుచేశారు. అసెంబ్లీ రికార్డులు, బులెటిన్‌లలో ఇప్పటికీ ఆయన బీఆర్‌ఎస్‌ సభ్యుడిగానే ఉన్నారని, సభలో పార్టీ జారీ చేసిన విప్‌లను కూడా ఆయన పాటించారని తెలిపారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం పార్టీ ఫిరాయింపు కిందకు రాదని న్యాయవాది వాదించారు. ఒక వ్యక్తి వేరే పార్టీ టికెట్‌పై పోటీ చేయడాన్ని ఫిరాయింపుగా పరిగణించాలనే నిబంధన రాజ్యాంగంలో లేదని, అసెంబ్లీ వెలుపల చేసే రాజకీయ కార్యకలాపాలకు, అసెంబ్లీ సభ్యత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. అనర్హత పిటిషన్ దాఖలు చేసేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారికంగా ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఆయన వాదించారు.

స్పీకర్ నిర్ణయం ఏకపక్షంగా ఉన్నప్పుడే కోర్టు జోక్యం చేసుకోవాలని, ఈ కేసులో అటువంటి పరిస్థితి లేదని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టివేయాలని ఆయన కోరారు. ఇరుపక్షాల వాదనల అనంతరం, ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.