భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా తలకు బలమైన గాయం కావడంతో, స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే సిరీస్ మొత్తానికి దూరమైనట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
తొలి వన్డేకు ముందు జరిగిన ప్రాక్టీస్ సమయంలో కాన్వే, మాట్ హెన్రీ ఫీల్డింగ్ చేస్తుండగా ఒకరికొకరు బలంగా ఢీకొన్నారు. దీంతో కాన్వేను వెంటనే ఆక్లాండ్‌లోని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ఆయన కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు నిర్ధారించారు.
కాన్వే స్థానంలో నిక్ కెల్లీని జట్టులోకి తీసుకుంటున్నట్లు కివీస్ బోర్డు తెలిపింది. శనివారం వెల్లింగ్టన్‌లో జరగనున్న రెండో వన్డే నుంచి నిక్ కెల్లీ జట్టుతో కలవనున్నారు. వాస్తవానికి నిక్ కెల్లీని సిరీస్‌లోని చివరి రెండు వన్డేల కోసం మాత్రమే ఎంపిక చేశారు, కానీ కాన్వే గాయం కారణంగా ఆయనను రెండో వన్డే నుంచే అందుబాటులోకి తెచ్చారు.
నిక్ కెల్లీ ప్రస్తుతం న్యూజిలాండ్-ఏ జట్టు తరఫున భారత్‌తో అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్నారు. జాతీయ జట్టుకు పిలుపు రావడంతో, ఆయన స్థానంలో ఆక్లాండ్ ఏసెస్ జట్టుకు చెందిన డేల్ ఫిలిప్స్‌ను న్యూజిలాండ్-ఏ జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు, కాన్వేను ఢీకొన్న మాట్ హెన్రీ కంకషన్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, ఆయన ఎంపికకు అందుబాటులో ఉన్నారని సమాచారం.
న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే పలువురు ఆటగాళ్ల గాయాలతో ఇబ్బంది పడుతోంది. రచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్ కూడా గాయాల కారణంగా ఈ వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. ఇప్పుడు కాన్వే కూడా ఈ జాబితాలో చేరడంతో కివీస్ జట్టు మరింత బలహీనపడింది.








