భారత్, శ్రీలంక జట్ల మధ్య డిసెంబర్ 13న జరగనున్న తొలి వన్డే మ్యాచ్ వేదికను బీసీసీఐ మార్చింది. తొలుత ఈ మ్యాచ్‌ను ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించారు.

ఢిల్లీలో వాయు కాలుష్యం అధికంగా ఉండటం, స్టేడియంలో ఔట్‌ఫీల్డ్‌ను కొత్తగా సిద్ధం చేసే పనులు జరుగుతుండటంతో వేదికను మార్చాలని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) కోరింది. ఈ అభ్యర్థనను పరిశీలించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మ్యాచ్‌ను విశాఖపట్నానికి మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

దీంతో డిసెంబర్ 13న విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. విశాఖలో మ్యాచ్ జరగనుండటంతో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశాఖ వేదికగా ఆడనుండటం ఇదే చివరిసారయ్యే అవకాశం ఉంది. ఈ ఇద్దరూ ఇప్పటికే టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికి వన్డేలు మాత్రమే ఆడుతున్నారు.

2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లు, ఆ టోర్నీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు ఆతిథ్యం ఇవ్వనున్న ఆ ప్రపంచకప్‌నకు ముందు వైజాగ్ వేదికగా జరిగే ఏకైక వన్డే మ్యాచ్ ఇదే కానుంది.

భారత పర్యటనకు రానున్న శ్రీలంక జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబర్ 13 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా, డిసెంబర్ 22 నుంచి టీ20 సిరీస్ మొదలుకానుంది.